Acts 24

ఫేలిక్స్ ముందు పౌలు

1ఐదు రోజుల తరువాత ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాది కైసరయ వచ్చి, పౌలు మీద మోపిన ఫిర్యాదును గవర్నరుకి తెలియజేశారు.

2పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరం మోపుతూ ఇలా అన్నాడు. 3“మహా ఘనత వహించిన ఫేలిక్స్, మేము మీ పరిపాలనలో ఎంతో నెమ్మది అనుభవిస్తున్నామనీ, ఈ దేశ ప్రజలకు కలిగే అనేక సమస్యలు మీ ద్వారా పరిష్కారం అవుతున్నాయనీ ఒప్పుకొంటున్నాము. ఆ కారణంగా మేము అన్ని విధాలా, అన్ని చోట్లా మీ పట్ల పూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాం.

4నేను మీకు ఎక్కువ విసుగు పుట్టించకుండా క్లుప్తంగా చెప్పే విషయాలను మీరు సహనంతో వినాలని వేడుకొంటున్నాను.

5ఈ వ్యక్తి ఒక చీడలాంటి వాడు. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడని మేము గమనించాం. 6పైగా ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు.

7అందువలన మేము అతణ్ణి నిర్బంధించాం. 8మీరు విచారిస్తే మేము ఇతని మీద మోపుతున్న నేరాలన్నీ మీకే తెలుస్తాయి.” 9యూదులంతా అందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పారు.

ఫేలిక్స్ ముందు పౌలు సంజాయిషీ

10అప్పుడు గవర్నర్, పౌలును మాట్లాడమని సైగ చేశాడు. పౌలు ఇలా అన్నాడు, “మీరు అనేక సంవత్సరాలుగా ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలిసి నేను ధైర్యంగా జవాబు చెప్పుకుంటున్నాను. 11నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు. 12దేవాలయంలోగానీ, సమాజ మందిరాల్లోగానీ, పట్టణంలోగానీ, నేను ఎవరితోనైనా తర్కించడం, లేదా ప్రజల మధ్య అల్లరి రేపడం ఎవరూ చూడలేదు. 13వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచలేరు.

14అయితే ఒక సంగతి మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నమ్మి, 15నీతిపరులకూ అనీతిపరులకూ పునరుత్థానం కలుగుతుందని వీరు నమ్ముతున్నట్టుగానే నేను కూడా దేవునిలో నమ్మకముంచి, వారు మతశాఖ అని పిలిచిన ఈ మార్గంలోనే నా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. 16ఈ విధంగా నేను దేవుని పట్లా, మనుష్యుల పట్లా ఎప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను.

17“కొన్ని సంవత్సరాలైన తరువాత నేను నా సొంత ప్రజలకి దాన ధర్మంగా డబ్బు, కానుకలు ఇవ్వడానికి వచ్చాను. 18నేను శుద్ధి చేసుకుని వాటిని అప్పగిస్తుండగా వీరు దేవాలయంలో నన్ను చూశారు. నేనేమీ గుంపు కూర్చలేదు, నా వలన అల్లరీ కాలేదు. 19అయితే ఆసియ నుండి వచ్చిన కొందరు యూదులు ఉన్నారు. నామీద వారికేమైన ఉంటే వారే మీ దగ్గరికి వచ్చి నా మీద నేరం మోపి ఉండవలసింది.

20
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Act 24:21.
In this translation, this verse contains text which in some other translations appears in verses Act 24:20-Act 24:21.
21లేదా, నేను మహాసభలో నిలబడి ఉన్నప్పుడు, ‘మృతుల పునరుత్థానం గురించి నేడు మీ ఎదుట విమర్శ పాలవుతున్నాను’ అని నేను బిగ్గరగా చెప్పిన ఆ ఒక్క మాట విషయమై తప్ప నాలో మరి ఏ నేరమైనా వీరు కనిపెట్టి ఉంటే అది చెప్పవచ్చు.”

22ఫేలిక్సుకు ఈ మార్గం గూర్చి బాగా తెలుసు. అతడు, “సహస్రాధిపతి లూసియస్ వచ్చినప్పుడు నీ సంగతి నేను విచారించి తెలుసుకుంటాను” అని చెప్పి విచారణ నిలిపివేశాడు. 23పౌలుని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారం చేయడానికి అతని బంధువుల్లో ఎవరినీ ఆటంకపరచవద్దని శతాధిపతికి ఆజ్ఞాపించాడు.

రెండవసారి ఫేలిక్స్ ముందు పౌలు

24కొన్ని రోజుల తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తు యేసులో విశ్వాసం గూర్చి అతడు బోధించగా విన్నాడు. 25అప్పుడు పౌలు నీతిని గూర్చీ ఆశానిగ్రహం గూర్చీ రాబోయే తీర్పును గూర్చీ ప్రసంగిస్తుండగా ఫేలిక్సు చాలా భయపడి, “ఇప్పటికి వెళ్ళు, నాకు సమయం దొరికినప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.

26తరువాత పౌలు తనకు ఏమైనా లంచం ఇస్తాడేమోనని ఆశపడి, అతణ్ణి మాటిమాటికీ పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు.

రెండేళ్ళు విరామం

రెండు సంవత్సరాల తరువాత ఫేలిక్సుకు బదులుగా పోర్కియస్ ఫేస్తు గవర్నరుగా వచ్చాడు. అప్పుడు ఫేలిక్సు యూదుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని, పౌలును చెరసాల్లోనే విడిచిపెట్టి వెళ్ళాడు.

27

Copyright information for TelULB